చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని విశ్వం థియేటర్‌లో వున్న ఆప్లిఫియర్స్, మోటార్‌లు, కరెంటు వైర్లు, బ్యాటరీలు, దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఒన్‌టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య అన్నారు. శుక్రవారం కడప ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు తెలియజేశారు. చోరీ కేసులో నిందితులుగా కడప నగరం కోటగడ్డ వీధికి చెందిన షేక్ తబ్రిష్, బిస్మిల్లానగర్‌కు చెందిన షేక్ ఉమర్, వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన షేక్ సద్దాం హుసేన్, చిలకలబావి వీధికి చెందిన షేక్ ముర్ఫత్‌ఖాన్, రవీంద్రనగర్‌కు చెందిన షేక్ గౌస్‌పీర్‌లు వున్నారన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కడప నగరంలోని మూతపడిన విశ్వం థియేటర్‌లోకి అక్రమంగా ప్రవేశించి సామగ్రిని దొంగలించారన్నారు. వీరిని గుర్రాలగడ్డ వీధి జెండాచెట్టు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రికవరీ చేసిన వస్తువులలో కరెంట్ వైర్లు కరిగించి తీయగా వచ్చిన కాపర్ వైరు, రెండు బ్యాటరీలు వాటి విలువ సుమారు రూ.70,000 వుంటుందన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప ఒన్‌టౌన్ సీఐ వి. చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, కానిస్టేబుళ్లు బాల చంద్ర, ఎన్.చిన్న నారాయణరెడ్డి, ఎల్‌వీ ప్రసాద్‌లను డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు అభినందించారు.
డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డి.ఎస్.పి ఎ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప వన్‌టౌన్ సి.ఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో కడప నగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, కడప సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పడుతూ దాడులు చేయిస్తూ నిందితులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. అనుమానిత ప్రాంతాల నుంచి పారిపోయిన నిందితులను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నగరంలోని పాత రిమ్స్, పాత మునిసిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం ద్వారా అనుమానితులను గుర్తించే చర్యలు చేపట్టారు. కడప నగరంలోని అనుమానిత ప్రాంతాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పట్టడం జరుగుతుందని కడప డి.ఎస్.పి వెంకటేశ్వర్లు తెలిపారు.


