ఉపసర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
● సర్పంచ్ చలపతితో సహా 9 మంది
వ్యతిరేకంగా ఓటు
● సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సమక్షంలో ఆమోదం
మదనపల్లె రూరల్ : కురవంక పంచాయతీ ఉపసర్పంచ్, టీడీపీ నాయకురాలు బైగారి భారతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కురవంక గ్రామ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఎల్‌పీఓ నాగరాజు సమక్షంలో గ్రామ సర్పంచ్ పసుపులేటి చలపతి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. గతంలో ఉపసర్పంచ్ బైగారి భారతిపై అవిశ్వాసం ప్రకటిస్తూ సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం కురవంక గ్రామసచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో.. ఉపసర్పంచ్ బైగారి భారతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. ఉపసర్పంచ్ బైగారి భారతి ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. వార్డు సభ్యులు కృష్ణమూర్తి, షాజహాన్‌బాషా, చంద్రకళ, గుల్జార్, అనిత, శ్రీనివాసులు, చంద్రిక, గులాబ్‌జాన్, నాగరాజ తదితరులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతూ చేతులు పైకి ఎత్తారు. మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు ఉపసర్పంచ్ బైగారి భారతిని పదవి నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామసభ తీర్మానం అంశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు పంపించనున్నట్లు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్‌మస్రూర్, పంచాయతీ సెక్రటరీలు పవన్‌కుమార్, గిరిధర్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


