రాష్ట్ర కార్యవర్గంలో చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ సోమసుందర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభతోపాటు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి కే టీవీ ఎడిటర్‌గా ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌ను బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ సహకారంతో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వృత్తి నైపుణ్య తరగతుల నిర్వహణకు ప్రయత్నం చేస్తానని వివరించారు. తన నియామకానికి సహకరించిన పూర్వ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
చైన్ స్నాచింగ్
సింహాద్రిపురం : మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కసనూరు గ్రామానికి చెందిన కొమ్మా రజిత తన గేదెలను గ్రామ చివరలో ఉన్న పొలాల వద్దకు మేపుకోవడానికి వెళుతుండేది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా ఆమె గేదెలను తన పొలాల వద్ద మేపుకొంటుండగా.. కసనూరు – ముసల్‌రెడ్డిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు నుంచి ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె వెనకవైపు బైకు నిలబెట్టి ఒక వ్యక్తి బంగారు గొలుసును తీసుకుని ముసల్‌రెడ్డిపల్లె రూట్ వైపు వెళ్లిపోయారు. తాళిబొట్టు, గొలుసు కలిపి మూడు తులాలపైగా ఉంటుందని బాధితురాలు భర్త కొమ్మా సాంబశివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్
రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్‌రెడ్డి


