బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి కొత్తపల్లె సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ పంచాయతీ కొత్తపల్లెకు చెందిన ఇందల రాంబాబు కుమారుడు రవీంద్ర(21) చైన్నెలోని బంగారు దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. చైన్నె నుంచి ఇంటికి వచ్చిన అతను కలకడ–గుర్రంకొండ రోడ్డులోని గ్రామంలో తన ద్విచక్రవాహనంపై వెళ్లడానికి అదే గ్రామానికి చెందిన రూపేష్‌తో కలిసి సిద్ధంగా ఉండగా.. గుర్రంకొండ వైపు నుంచి కలకడ వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రవీంద్ర, గాయపడ్డ రూపేష్‌ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. గాయప్పడ్డ రూపేష్ తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ ముజీర్ తెలిపారు.
ఇంటికి వచ్చిన 24 గంటల్లోనే మృత్యు ఒడికి..
జీవనోపాధి నిమిత్తం చైన్నెలోని బంగారు దుకాణంలో కూలీ పని చేసే రవీంద్ర (21) ఇంటికి చేరుకున్న 24 గంటల్లోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుడిని ప్రమాదం కబళించడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగారు.


