మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
రాయచోటి: జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మత్తుమందు విక్రయాలను కట్టడి చేసే విషయంలో భాగంగా జిల్లాలోని మెడికల్ షాపు యజమానులు డాక్టర్ ప్రిస్కిప్షన్ (చీటీ) లేకుండా నార్కోటిక్ మందులను విక్రయించవద్దన్నారు. బస్సు, రైల్వేస్టేషన్లలో పార్శిల్ సర్వీసుల ద్వారా ఎలాంటి మాదకద్రవ్యాల రవాణా జరగకుండా తరచూ పర్యవేక్షించాలన్నారు. కాలేజీ, పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులతో ఈగల్ క్లబ్స్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్‌పై జిల్లాలో ఇప్పటి వరకు 2560 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 1940 గ్రామాలు, 620 పాఠశాలలు, కళాశాలలలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంపై 60 గ్రామాలు, 155 స్కూల్స్, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2 నెలల కాలంలో జిల్లాలో 7 గంజాయి కేసులు పెట్టామన్నారు. 63.515 కేజీలు సీజ్ చేసి 52 మంది నిందితులను గుర్తించామన్నారు. వారిలో 27 మందిని అరెస్టు చేశామన్నారు. పాఠశాల ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం డ్రగ్స్ గంజాయి నేరం.. డ్రగ్స్ వద్దు స్కిల్స్ ముద్దు.. డ్రగ్స్ వద్దు బ్రో, వివిధ రకాల పోస్టర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక సవరణ–2026 కార్యక్రమంపై సమీక్ష
జిల్లాలో ప్రత్యేక సవరణ–2026, కొత్త పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా కొత్తపోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026వ సంవత్సరం, జనవరి 1వ తేదీ నాటికి అర్హత తేదీగా తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితాల నవీకరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


