కూరపర్తి కోటకు పునర్ వైభవం
● తొలి పూజలందుకునే వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి
● హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని కూరపర్తి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల నాటి కోట ఉంది. పూర్వ కాలంలో కూరపర్తి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామస్తులు ఆపద సమయాలు, విపత్కర పరిస్థితుల్లో ఇక్కడే తలదాచుకుని శత్రువుల నుంచి రక్షణ పొందేవారని కథనం. కోట ఆవరణలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టించి పూజలు చేసేవారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రాంగణంలో తాగునీటి కోసం చేతబావిని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా లేని విధంగా కూరపర్తి కోట 30 అడుగుల ఎత్తు, నాలుగు వైపులా పెద్ద బురుజులు ఉండటం ఈ కోట ప్రత్యేకతగా నిలిచింది. కాలానుగుణంగా కూరపర్తి, గంగాదొడ్డి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామాల్లోగానీ, ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలన్నా, వ్యవసాయ పనులు ప్రారంభించాలన్నా ముందుగా కోటలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి మొదటి పూజలు చేసి తరువాత ప్రారంభించేవారు. ఇప్పటికీ గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం ప్రతి శుభ కార్యక్రమానికి మొదట ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
శిథిలావస్థకు చేరుకున్న కూరపర్తి కోట..
వందల సంవత్సరాల నాటి కోట కట్టడాలు క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పులి చిట్టెమ్మ కోటను పునర్ నిర్మించాలని సంకల్పించారు. ఇందుకు గ్రామస్తులు తోడయ్యారు. ఉన్నత చదువులు చదివి, వివిధ హోదాలలో స్థిరపడిన గ్రామస్తులు కోట అభివృద్ధికి తోడ్పాటునందించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో పునర్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. దీంతో చరిత్ర కలిగిన కోట నూతనంగా దర్శనమిస్తుండటంతో గ్రామస్తులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కోట ఉత్సవాలు ప్రారంభం..
గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కోట ప్రాంగణంలో గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై, అఖండ దీప పూజ, గోపూజ, కలశ స్థాపన చేపట్టారు. 28న శుక్రవారం ఉదయం అంకురార్పణ, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి మూల విగ్రహాలకు అభిషేకం, సాయంత్రం నవగ్రహ హోమాదులు, భక్తులకు తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది. 29న ఉదయం సుప్రభాతం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కలశ పూజ, సుదర్శన హోమం, కుంభాభిషేకం, భక్తులకు అన్నదానం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
కోట పునర్ నిర్మాణం శుభపరిణామం
పురాతన చరిత్ర కలిగిన కూరపర్తి కోట శిథిలావస్థకు చేరుకోవడంతో కోటలో వేంకటేశ్వరస్వామికి పూజలు చేయడానికి ఇబ్బందికరంగా ఉండేది. గ్రామస్తులందరి సహకారం, దైవానుగ్రహంతో కోట తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం శుభపరిణామం.
– పులి రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కూరపర్తి
భక్తుల ఆకాంక్ష నెరవేరింది..
కూరపర్తి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు ఒకప్పుడు అండగా నిలిచింది ఈ కోట. కోటలోని వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట వరం. అలాంటి చరిత్ర కలిగిన కోట తిరిగి కొత్తగా రూపు దాల్చడంతో భక్తుల ఆకాంక్షలు నెరవేరినట్లయింది.
– యాలపల్లి రామచంద్ర, మాజీ సర్పంచ్, కూరపర్తి
కూరపర్తి కోటకు పునర్ వైభవం
కూరపర్తి కోటకు పునర్ వైభవం
కూరపర్తి కోటకు పునర్ వైభవం


