జార్ఖండ్‌వాసి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : జార్ఖండ్‌కు చెందిన యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం హుస్సేనాబాద్ జిల్లా కంగార్‌పూర్ తాలూకా జమూలా గ్రామానికి చెందిన రామ్‌ప్రీత్ రాజ్వార్ కుమారుడు మోతీ రాజ్వార్(23) సెంట్రింగ్ పనులు చేసేవాడు. ఉపాధి కోసం కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చాడు. మండలంలోని పోతబోలు పంచాయతీ కురవపల్లెకు సమీపంలో జరుగుతున్న పనులకు ప్రతిరోజు వెళ్లేవాడు. మరో జార్ఖండ్ యువకుడితో కలిసి స్థానికంగా నివసించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జార్ఖండ్‌లోని కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ గొడవపడ్డాడు. గొడవ అనంతరం స్నేహితుడితో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. ఉదయం స్నేహితుడి కోసం వారు వెతకగా, శ్రీ వేద స్కూల్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయక్ మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడితో పాటు పనిచేసే స్నేహితులను ఆత్మహత్యకు కారణాలను అడిగి విచారించారు. కాగా స్వగ్రామంలో మోతీ రాజ్వార్‌కు ప్రేమ వ్యవహారం ఉందని, వారి మధ్య తలెత్తిన విభేదాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. జార్ఖండ్‌వాసితో స్థానికంగా పనులు చేయిస్తున్న మేసీ్త్ర శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ కలహాలతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. చంద్రాకాలనీలో కాపురం ఉంటున్న రూబియా(25) కుటుంబ సభ్యులతో గొడవపడి తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.


