విచారణ పేరుతో పిలిచి చితకబాదాడు
మదనపల్లె రూరల్ : ప్రేమజంట విషయమై విచారణ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచి, అమ్మాయి ఆచూకీ తెలపాలని అబ్బాయి తండ్రిని కానిస్టేబుల్ చితకబాదిన ఘటన రామసముద్రంలో జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు గాయాలపాలైన బాధితుడు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాల మహానాడు నాయకులు పరామర్శించి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ.. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చవారిపల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు మణి, అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని 15 రోజుల క్రితం తీసుకువెళ్లాడని అమ్మాయి కుటుంబ సభ్యులు రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. మదనపల్లె పట్టణం బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న అబ్బాయి తండ్రి వెంకటేష్‌ను, అమ్మాయి విషయంగా విచారణ చేసేందుకు కానిస్టేబుల్ భరత్, రామసముద్రం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడన్నారు. అమ్మాయి ఆచూకీ తెలపాల్సిందిగా వెంకటేష్‌ను చిత్రహింసలకు గురిచేసేవారన్నారు. అయితే రెండురోజులుగా వెంకటేష్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకపోవడంతో కానిస్టేబుల్ భరత్, కాళ్లు, చేతులపై లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడన్నారు. తప్పుచేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలే తప్ప, విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించి, తీవ్రంగా కొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్‌ను తీవ్రంగా గాయపరిచిన కానిస్టేబుల్ భరత్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమలా చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్


