రాయచోటి జగదాంబసెంటర్/సంబేపల్లె: ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలోని పంచ సూత్రాల అమలుతో రైతుల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి మండలం ఇందుకూరుపల్లి, సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామం వంగిమళ్ళ వాండ్లపల్లెలో జరుగుతున్న పంచ సూత్రాల అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది అమలు చేస్తున్నారా లేదా తృణధాన్యాలు పశువుల పెంపకం ఎరువుల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పిస్తున్నారా లేదా వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశ్నలకు స్పందించిన రైతులు తమకు పశువులు అందించగలిగితే తమకు ఉపయోగకరంగా ఉంటుందని తెలపగా దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ ఏడీఏ శ్రీలత ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్ ఎంపీడీవో వెంకటసుబ్బారెడ్డి డిప్యూటీ ఎంపీడీవో సునీల్ గ్రామ వ్యవసాయ సహాయకురాలు మహేశ్వరి రైతులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


