ఆవిష్కరణల రూపకర్తలుగా విద్యార్థులు
రాయచోటి : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందింపజేసి ఆవిష్కరణల రూపకర్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అటల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణం మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైన అటల్ టింకరింగ్ పాఠశాలల మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులలోని నైపుణ్యాలను పెంపొందింప చేయడానికి ఉద్దేశించి అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను స్థాపించారన్నారు. ప్రయోగశాలలోని పరికరాలను సక్రమంగా ఉపయోగిస్తే విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధి జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులు విభిన్న ఆలోచనలను కలిగి నూతన ఆవిష్కరణలను రూపొందిస్తారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి, జిల్లా రీసోర్స్ సభ్యులు వేణుగోపాల్‌రెడ్డి, షర్ఫుద్దీన్, హేమంత్, వెంకటేశ్వర్లు, మనోహర్, అజయ్, సాయి, అటల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇన్‌చార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


