డిసెంబర్‌లో అరటి ధరలు పెరిగే అవకాశం
పుల్లంపేట/రైల్వేకోడూరు : డిసెంబర్ నెల చివరలో అరటి ధరలు పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి పేర్కొన్నారు. బుధవారం రైల్వేకోడూరు, పుల్లంపేట మండల పరిధిలోని బావికాడపల్లెలో సాగులో ఉన్న అరటి తోటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 500 ఎకరాల్లో రెండో పిలక కోతకు వస్తుందని, డిసెంబర్ చివరి నాటికి 3000 ఎకరాల్లో పంట కోతకు వస్తుందని తెలిపారు. మహారాష్ట్రలో అరటిపంట కోతలు పూర్తయినందున వచ్చే నెలలో ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ధరలు పెంచే విషయమై ఉద్యాన శాఖ కమిషనర్ ఎగుమతిదారులు, ఢిల్లీ వ్యాపారులతో చర్చలు జరిపారని తెలిపారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు, రాజంపేట, చిట్వేలి ఉద్యాన అధికారులు భాస్కర్, సునీల్, లోకేష్, ఉద్యాన సహాయకులు విష్ణు, రెడ్డిప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.


