పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలి
చిన్నమండెం : పాడి రైతులకు 50 శాతం రాయితీతో అందజేస్తున్న పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ రాయచోటి ఉప సంచాలకుడు డాక్టర్ డి.మాలకొండయ్య తెలిపారు. చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లె, వండాడి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో రైతులకు పశువుల దాణాను అధికారులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ భాస్కర్, పశువైద్య సహాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు.
స్థలం వివాదం.. ముగ్గురిపై దాడి
మదనపల్లె రూరల్ : స్థలం వివాదం కారణంగా ముగ్గురిపై దాడిచేసిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలు పంచాయతీ మేడిపల్లెకు చెందిన మల్లప్ప(65)కు స్థానికంగా కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గంలోని వ్యక్తులు ఆక్రమించి మట్టి తోలారు. ఈ విషయమై మల్లప్ప, అతడి కుమారుడు నాగభూషణం(40) దొనబైలులో నివాసం ఉన్న కుమార్తె కళావతమ్మ(49)తో కలిసి ప్రశ్నించారు. తమ స్థలంలో ఎందుకు మట్టి తోలారంటూ నిలదీశారు. దీంతో అదే గ్రామానికి చెందిన మల్లికార్జున, కృష్ణమురారి, రాజేంద్ర, చిన్నప్ప, సుభద్ర కలిసి మల్లప్ప వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దాడిలో నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో బాధితులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. దాడి ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరి పంటపై
అడవి పందుల దాడి
సుండుపల్లె : మండల పరిధిలోని భాగంపల్లి గ్రామానికి చెందిన రామాంజులురెడ్డి వరి పంటపై మంగళవారం రాత్రి అడవి పందులు దాడి చేశాయి. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ రెండు ఎకరాలలో వరి పంటను సాగు చేశానని రూ.60 వేలు ఖర్చు చేశానని తెలిపాడు. పంట కోత దశలో ఉన్న క్రమంలో అడవి పందుల గుంపు పంటను ధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సీజ్ చేసిన ఇసుక తరలింపు
ములకలచెరువు : మండలంలోని సోంపల్లె పంచాయతీ జవకలకోట వద్ద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కాలువ పనుల కోసం డంప్ చేసిన ఇసుకను పలువురు కూటమి నాయకులు ట్రాక్టర్ల ద్వారా ఇళ్ల పనులకు తోలుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ ఇసుకను అక్రమంగా తరలించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షగట్టి 265 ఏ సర్వే నంబరులో డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఇసుకను తరలించకుండా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం ఇసుక రక్షణ బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రెవెన్యూ అధికారులను సైతం లెక్క చేయకుండా కూటమి నాయకులు ఇష్టానుసారంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తూ మంగళవారం పట్టుబడ్డారు. దీనిపై తహసీల్దార్ ప్రదీప్‌కు ఫిర్యాదు చేయగా సీజ్ చేసిన ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలి
పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలి


