అన్నమయ్య జిల్లాను యథాతథంగా ఉంచండి
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను అడ్డగోలుగా విభజించి, రాయచోటిపై రాజకీయ ప్రతాపం చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను వివరించారు. గత జగన్ ప్రభుత్వం పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేసి, పారదర్శకంగా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచిందన్నారు. అప్పట్లో అడ్డగోలుగా జిల్లాల పునర్విభజన చేశారని గగ్గోలు పెట్టి విమర్శలు చేసిన వారే నేడు అప్పుడు ఏర్పాటు చేసిన జిల్లాలనే కుదించేసి, కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. మదనపల్లెను 4 నియోజకవర్గాలతో జిల్లా కేంద్రం చేసి, రాయచోటి నుంచి మదనపల్లెను విభజించి ఏమి సాధించారన్నారు. మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించడానికి బాధగా ఉందన్నారు. ఒక జిల్లా కేంద్రం ఆరు లేక ఏడు నియోజకవర్గాలతో 30 మండలాలకు పైగా ఉంటే అక్కడికి వచ్చే కలెక్టర్‌లు, ఎస్పీలు శ్రద్ధగా, బాధ్యతగా విధులు నిర్వహిస్తారన్నారు. రెండు, మూడు నియోజకవర్గాలతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదమన్నారు.
ఎందుకంత వివక్ష.. కక్ష..
ఎన్నికల సమయంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని చెప్పారే, సత్యసాయి జిల్లాను ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. మీకు అన్నమయ్య జిల్లాపైనే ఎందుకంత వివక్ష , కక్ష అని ఆయన నిలదీశారు. నాటి జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులు నీలం సాహ్ని, కృష్ణబాబు, జవహర్‌రెడ్డి తదితర సభ్యులందరి దగ్గరికి వెళ్లి ఈ నియోజకవర్గంలో ఖాళీ స్థలాలు, వెనుకబాటుతనాన్ని వివరించామని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రానికి తీసిపోని విధంగా కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయించి, అతి స్వల్ప కాలంలోనే 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడంతో ఇది ఎలా సాధ్యపడిందని అందరూ రాయచోటి వైపు చూసేలా కృషి చేశామన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించలేం
రాయచోటిపై రాజకీయ ప్రతీకారం
జిల్లా విభజన అన్యాయం
ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి


