ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన లావనూరు ఇషితరెడ్డి(18) అనే యువతి మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. లావనూరు రామసుబ్బారెడ్డి, రాజేశ్వరిలకు కొడుకు, కూతురు ఉన్నారు. రామసుబ్బారెడ్డి కడపలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తారు. రాజేశ్వరి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌లో పనిచేస్తారు. కొడుకు అఖిల్ చైతన్యరెడ్డి కడపలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఇషితరెడ్డి కడపలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. అయితే ఇషితారెడ్డి బుధవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తండ్రి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కుటుంబ సమస్యలతో..
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ ఎగువకురవంకకు చెందిన మునిరాజ(45) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు.
గొంతు కోసుకుని..
మదనపల్లె రూరల్ : గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కర్నాటక రాయల్పాడుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగయ్య(30) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో గొంతు, చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బావమరిదితో గొడవపడి..
మదనపల్లె రూరల్ : నగదు విషయమై బావమరిదితో గొడవపడి బావ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలో జరిగింది. అప్పినపల్లెకు చెందిన గోపన్న కుమారుడు మంజునాథ(35) బుధవారం బావమరిది గంగరాజుతో నగదు విషయమై గొడవపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం మనస్తాపం చెంది ఇంటి వద్దే విష ద్రావణం మద్యంలో కలుపుకుని తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తీసుకెళ్లారు.


