కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
రాయచోటి అర్బన్ : దేశంలో కార్పొరేట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లుగా మార్చిందని కార్మిక , రైతు సంఘాల నేతలు ఆరోపించారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలతో కలిసి సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సీపీఐ(ఎంఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాఽథ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, కృష్ణప్ప డిమాండ్ చేశారు. 2019లో వేతన కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాయన్నారు. అయితే గత ఐదేళ్ల నుంచి వాటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం లేకుండా పోయిందన్నారు. నూతనంగా వచ్చిన కార్మిక చట్టాలు కార్మికులను పీల్చి పిప్పిచేస్తాయని వారు తెలిపారు. ఇప్పటికై నా ఆ చట్టాలను రద్దు చేయకపోతే రాబోవు రోజుల్లో ప్రతిఘటన, పోరాటాలు అనివార్యం అవుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, చెన్నయ్య, అక్బర్, ముబారక్, వేణుగోపాల్ రెడ్డి, నరసింహులు, తిరుమల, దేవా, చలపతి నాయుడు, జానకీ, రాధా తదితరులు పాల్గొన్నారు.


