హత్య కాదు.. ప్రమాదమే
కలికిరి : మండలంలోని సత్యాపురానికి చెందిన ముంగర వినీత్ కుమార్ రాజు(25) ఒంటి నిండా తీవ్రగాయాలతో ఈ నెల 14న అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని తల్లి ముంగర సుకన్య తన కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డుపై పడేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వినీత్‌కుమార్ రాజుది హత్య కాదు.. ప్రమాదమేనని విచారణలో తేల్చారు. బుధవారం పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అబూబకర్ పెద్ద కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా వినీత్‌కుమార్‌రాజు, కలికిరికి చెందిన నౌషాద్, అహ్మద్, టి.మాదిగపల్లికి చెందిన నరేష్‌లు ఈ నెల 14న రాత్రి 9.30 గంటలకు నౌషాద్ కారులో బయల్దేరి కలికిరిలో ఓ మద్యం దుకాణంలో మద్యం తీసుకున్నారు. కారులో తాగుతూ రాయచోటికి వెళ్లి తిరిగి కలికిరికి బయలుదేరారు. క్రాస్ రోడ్డులో అబూబకర్, అహ్మద్‌లను దింపిన నౌషాద్ సత్యాపురంలో వినీత్‌ను దింపి టి.మాదిగపల్లిలో నరేష్‌ను దింపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో ఎదురుగా వచ్చిన వినీత్‌కుమార్ రాజును ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే వినీత్‌కుమార్ చనిపోయాడు. నౌషాద్ జరిగిన ఘటనను ఎవ్వరికీ చెప్పకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుల కాల్‌డేటా, వారు ఇచ్చిన వివరాల మేరకు వినీత్ హత్యకు గురి కాలేదని, ప్రమాదంలోనే మరణించినట్లు తెలిపారు. నలుగురు నిందితులను బుధవారం కలికిరి పాలిటెక్నిక్ వద్ద అరెస్టు చేసినట్లు కలికిరి ఇన్‌చార్జి సీఐ యుగంధర్ తెలిపారు.


