కంటైనర్ లారీ.. కారు ఢీ
ములకలచెరువు : కంటైనర్ లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సాపిరెడ్డిగారిపల్లెకు చెందిన సీవీ వెంకటరమణ, సీవీ రాజశేఖర్‌లు కొన్నేళ్ల క్రితం నుంచి మదనపల్లెలోని ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్నారు. బంధువుల పెళ్లి ఉండడంతో మంగళవారం రాత్రి కారులో సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తవళం గ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం పెళ్లి చూసుకొని తిరిగి ఇంటికి కారులో వస్తుండగా ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ ఆవులవారిపల్లి క్రాస్‌వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ, వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సీవీ వెంకటరమణ(65) రిటైర్డ్ కండక్టర్ కాగా, సీవీ రాజశేఖర్ మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరసింహుడు, సిబ్బంది ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరి దుర్మరణం


