కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
మదనపల్లె రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్ట్‌కు సంబంధించి డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో..అన్నమయ్యజిల్లా డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న కే.ఆంజనేయులు, బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ బృందంగా ఏర్పడి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, విశాఖకు చెందిన ఇద్దరు మహిళలకు నవంబర్ 9న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో ఒక ఆపరేషన్ విజయవంతం కాగా, రెండో ఆపరేషన్‌లో విశాఖపట్నానికి చెందిన యమున, సర్జరీ తర్వాత ఫిట్స్ వచ్చి 10వతేదీ ఉదయం మరణించింది. ఘటనపై యమున తల్లి సూరమ్మ ఫిర్యాదుమేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌నెంబర్.179/2025, బీఎన్‌ఎస్, హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్–2011 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో ప్రధాన నిందితుడైన అన్నమయ్యజిల్లా డీసీహెచ్‌ఎస్, గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు కే.ఆంజనేయులు, మదనపల్లె, కదిరి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి డయాలసిస్ టెక్నీషియన్స్ బాలరంగడు, మెహరాజ్, దళారులుగా వ్యవహరించిన పిల్లి పద్మ, సత్య, సూరిబాబులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటుగా కిడ్నీ రాకెట్ కేసులో ఆపరేషన్ చేసేందుకు సహకరించి, పరారీలో ఉన్నటువంటి కడపకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు సుమన్, కొండయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. దీంతో కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్‌చేసిన నిందితుల సంఖ్య 8 కి చేరుకుంది. కిడ్నీ రాకెట్‌లో కీలకంగా వ్యవహరించిన ఏ–2 బెంగళూరు డాక్టర్‌గా పోలీసులు పేర్కొంటున్న వ్యక్తి...కడపకు చెందిన యూరాలజీ డాక్టర్ పార్థసారధిరెడ్డిగా పోలీసులు గుర్తించినట్లు, అతడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో టూటౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా పాల్గొన్నారు.
కడపకు చెందిన ఆపరేషన్ థియేటర్
అసిస్టెంట్లుగా గుర్తింపు


