ఎర్రచందనం జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం
సిద్దవటం : ఎర్రచందనం జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కర్నూలు రేంజ్ సీసీఎఫ్ కృష్ణమూర్తి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రమైన సిద్దవటంలోని మట్లి రాజులకోటలోని మొదటి మండపం, రెండవ మండపం, డంకా నగర్, హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా ఖాద్రి దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. అలాగే సొరంగమార్గం ద్వారా పెన్నానదిలోని అందాలను బయనాకురల్‌తో తిలకించారు. అలాగే సిద్దవటం రేంజ్‌లోని సాహెబ్ బాఇ బేస్ క్యాంప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ లంకమల అభయారణ్యం పర్యటన నేపథ్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగిందన్నారు. అటవీ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠినచర్యలు తప్పవని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. సిద్దవటంలో ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెన్నానది హైలెవెల్ వంతెనపై లైటింగ్, పెన్నానదిలో పర్యాటక అందాలను తిలకించేందుకు, పర్యాటకులన ఆకర్షించేలా టెంట్ల ఏర్పాటు, కోటలో లైటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సందర్శించి టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. లంకమల అభయారణ్యంలోని సిద్దవటం రేంజ్‌లోని సాహెబ్ బావి బేస్ క్యాంపు, టైగర్ జోన్‌లను మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్, సిద్దవటం రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీటు, అసిస్టెంట్ బీటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


