టైపిస్ట్‌ ప్రశాంత్‌ నాయక్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

టైపిస్ట్‌ ప్రశాంత్‌ నాయక్‌ సస్పెన్షన్‌

Nov 26 2025 6:47 AM | Updated on Nov 26 2025 6:47 AM

టైపిస్ట్‌ ప్రశాంత్‌ నాయక్‌ సస్పెన్షన్‌

టైపిస్ట్‌ ప్రశాంత్‌ నాయక్‌ సస్పెన్షన్‌

సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

– డిజిటల్‌ కీ దుర్వినియోగంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

రాయచోటి : సుండుపల్లి మండలంలో అక్రమంగా పొసెషన్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన టైపిస్టు ప్రశాంత్‌ నాయక్‌ను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం సస్పెండ్‌ చేశారు. టైపిస్టు అక్రమంగా జారీ చేసిన 27 పొసెషన్‌ సర్టిఫికెట్లు, 04 రిజిస్ట్రేషన్‌లను రద్దు చేస్తూ కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. సుండుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో టైపి స్టుగా పనిచేస్తున్న ప్రశాంత్‌ నాయక్‌ తహసీల్దార్‌ అనుమతి లేకుండా డిజిటల్‌ కీ దుర్వినియోగానికి పాల్పడిన ఘటనను తహసీల్దార్‌ తన దృష్టికి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. తహసీల్దార్‌ సమాచారం మేరకు రాజంపేట సబ్‌ కలెక్టర్‌ను సభ్యురాలిగా వన్‌ మ్యాన్‌ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌ భావన ఇచ్చిన నివేదిక ఆదారంగా టైపిస్టు ప్రశాంత్‌ నాయక్‌ డిజిటల్‌ దుర్వినియోగానికి పాల్పడినట్లు ధ్రువీకరించారన్నారు. వెంటనే అతడిని సస్పెండ్‌ చేసి అక్రమంగా జారీ చేసిన పొసెషన్‌ సర్టిఫికెట్లు రద్దు చేశామన్నారు. సుండుపల్లి తహసీల్దార్‌ మహబూబ్‌చాంద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ వేగంగా జరుగుతోందన్నారు.

నిమ్మనపల్లె : మండలంలోని గ్రామసచివాలయ ఉద్యోగి బహుదా ప్రాజెక్ట్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. విఠలం గ్రామ సచివాలయంలో విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ (29) సాయంత్రం విధులు ముగిశాక, బహుదా ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకుంది. మెయిన్‌ గేట్‌ ముందు ఉన్నటువంటి లోతైన ప్రదేశంలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. గమనించిన మత్సకారుడు శ్రీధర్‌, స్థానికులు పరుగు, పరుగున వెళ్లి అడ్డుకున్నారు. నిమ్మనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ తిప్పేస్వామి ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ నవయుగనాథ్‌ అక్కడకు చేరుకుని సచివాలయ ఉద్యోగిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. తోటి సచివాలయ ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ విఫలమైందనే కారణంతో ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పడంతో, స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తాగిన మత్తులో వీరంగం

సృష్టించిన వ్యక్తి అరెస్టు

రాయచోటి టౌన్‌ : తాగిన మత్తులో వీరంగం సృష్టించిన ఓ యువకుడిని రాయచోటి అర్బన్‌ పోలీసులు అరె స్టు చేసి కోర్టుకు హాజరు పెట్టారు. రాయచోటి అర్బన సీఐ బివి చలపతి కథనం మేరకు.. పాత రాయచోటికి చెందిన ఎం. కల్యాణ్‌ అనే యువకుడు శనివారం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె వద్ద మద్యం తాగి రాయచోటికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను ఆపే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రవర్తన చూసిన డ్రైవర్లు బస్సు ఆపకుండా వచ్చేశారు. దీంతో చేసేది లేక ఆటో ఎక్కి అతడు రాయచోటికి చేరుకున్నాడు. తాను ఆపితే ఆపకుండా వస్తారంటూ కోపంతో మత్తులో ఆర్టీసీ బస్టాండ్‌ వైపు నుంచి బంగ్లా వైపు వస్తున్న బస్సులన్నింటినీ ఆపుతూ వీరగం సృష్టించారు. చేతిలో బీరు బాటిల్‌ (సగం పగిలిన) పట్టుకొని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement