యథేచ్ఛగా భూముల కబ్జా
పుల్లంపేట : మండలంలో భూ కబ్జాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములైనా సరే ప్రైవేటు భూములైనా మాకు అడ్డేముందని టీడీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఓ వైపు రీసర్వే జరుగుతున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల పేర్లు ఉన్నప్పటికీ మాకేం సంబంధం లేదంటూ ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. మండల పరిధిలోని తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామంలో 2014లో అప్పటి ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం తలా రెండెకరాలు భూపంపిణీ చేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేదలకు పంపిణీ చేసిన భూములపై కూటమి నాయకుల కళ్ళు పడ్డాయి. అంతే మరో ఆలోచన లేకుండా జేసీబీ యంత్రాలను పొలంలోకి తెచ్చి దున్నేశారు. లబ్ధిదారులు మా భూముల్లో పనులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో పోండి అంటూ గెంటేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామం సర్వేనెంబరు 1442–1లో ఎన్.సుజాత, 1443–4లో ఎన్.మల్లిక, 1444–1లో కె.పిచ్చమ్మ, 1444–7లో వై.గంగమ్మ, 1444–9లో టి.సుజాత, 1444–10లో కె.నరసమ్మలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ఆయా భూముల్లో లబ్ధిదారులు ఇప్పటికే బోరు కూడా వేసి డ్రిప్ పైపులు వేసి ఉన్నారు. కానీ ఆయా భూముల్లోకి వెళ్ళే పరిస్థితులు లేవంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా భూములు చూపారు గానీ కబ్జాదారులకు అడ్డుకట్టవేయలేకపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌ఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా గతంలో ఓసారి ఫిర్యాదు చేయగా లబ్ధిదారులకు వారి భూములను చూపించామని తెలిపారు.


