నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు
● రూ.15 లక్షలు విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం
● నిందితుల్లో సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా పోలీసులు నలుగురు చైన్ స్నాచర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.15 లక్షలు విలువ చేసే 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకట్రాది వివరాలు తెలిపారు. గత కొన్ని రోజులుగా పాదచారులను లక్ష్యంగా చేసుకొని బంగారు నగలు దోచుకున్న సంఘటనలపై వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సోమవారం రాయచోటి పట్టణ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. నిందితుల్లో కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన కుంచపు పురుషోత్తం, పూజారి శంకరయ్య, బండి బాలాజీ, కలకడ మండలానికి చెందిన సచివాలయ ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ కుంచపు మహేష్ బాబు ఉన్నారన్నారు. వీరు నలుగురు సంబేపల్లె, కలకడ, కలికిరి, పీలేరు, గుర్రంకొండ, పీలేరు, కేవీపల్లె మండల కేంద్రాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలను దోచుకొనేవారన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకొన్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు విలువ గల 140 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు నాలుగు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు, 15 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న, కేవీపల్లె ఎస్‌ఐ యం. చిన్నరెడ్డెప్ప, కలకడ ఎస్‌ఐ బి.రామాంజనేయులు పాల్గొన్నారు.


