నగల దుకాణం వ్యాపారి అదృశ్యం
● నగల తయారీ పేరుతో లక్షల్లో వసూలు
● వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మదనపల్లె రూరల్ : కొన్నేళ్లుగా నమ్మకంగా నగల వ్యాపారం నిర్వహిస్తూ, ఆభరణాలు తయారు చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించిన ఓ నగల దుకాణ వ్యాపారి కనిపించకుండా పోయాడు. పెద్ద మొత్తంలో నగదు, నగలు వసూలు చేసుకుని వారం రోజులుగా దుకాణం మూసివేశాడు. నివసిస్తున్న ఇంటికి తాళం వేశాడు. దీంతో అతని వద్ద నగలు చేయించడానికి డబ్బులు కట్టిన కస్టమర్లు మాట్లాడే ప్రయత్నం చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలంటూ సోమవారం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం, స్థానిక సిపాయి వీధికి చెందిన కె.సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ పేరుతో స్థానికంగా జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇందులో బంగారు ఆభరణాలు విక్రయించటంతో పాటు ఆర్డర్ పై ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఇతనితోపాటు సోదరుడు నాని, తండ్రి నారాయణ ఆచారి షాపులో పనిచేసేవారు. కాగా ఇతనికి మదనపల్లె మండలం బొమ్మనచెరువుకు చెందిన మహేష్ రూ. 3.4 లక్షలు చెల్లించి ఆభరణాలు ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా నగలు చేసి ఇవ్వాలంటూ రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి 150 గ్రాముల పాత బంగారు, రూ. 15 లక్షలు నగదు ఇచ్చాడు. పట్టణానికి చెందిన రవిచంద్ర రూ. 3 లక్షలు, రవితేజ రూ.8 లక్షలు ఇచ్చారు. ఇలా పలువురి వద్ద నగలు ఆర్డర్ తీసుకున్న సురేష్ కుమార్ లక్షల్లో వసూలు చేసుకొని, కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండా పోయాడు. షాపు తెరవకపోవడం, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏమి చేయాలో తెలియని బాధితులు మోసపోయామేమోనని భావించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. అయితే సురేష్ కుమార్ వీరి వద్దనే కాకుండా పలువురి వద్ద పెద్ద మొత్తంలో నగలు, నగదు తీసుకుని ఉడాయించి, కోర్టులో ఐపీ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు బాధితులు అంటున్నారు.


