నిండిన నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు
నిమ్మనపల్లె : ఇటీవల కురిసిన వర్షాలకు నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 398.6 ఎంసిఎఫ్‌టిలు కాగా, సోమవారం తెల్లవారుజామున పూర్తిస్థాయిలో ప్రాజెక్టులోకి నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ ఏఈ శ్రీహరి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రెండు ప్రాజెక్టు గేట్లను ఎత్తి, 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రవాహం కొనసాగే ప్రాంతాలైన ముష్టూరు, కొండయ్యగారిపల్లె, అగ్రహారం, బండమీదపల్లె, తదితర ప్రాంతాల ప్రజలకు అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు సూచించారు. ప్రజలు రోడ్డు దాటకుండా కంచెలు ఏర్పాటు చేశారు. నిమ్మనపల్లె అహోబిల నాయిని చెరువు పూర్తిస్థాయిలో నిండి, వరద వెళుతుండడంతో నిమ్మనపల్లె సాహిద్ షా వలి కట్టకు సందర్శకుల రాకను నిలిపివేశారు. బాహుదా ప్రాజెక్టు తాజా పరిస్థితిని, వరద ప్రవాహాన్ని తహసీల్దార్ తప్పస్విని, ఎంపీడీఓ రమేష్ బాబు, ఎస్‌ఐ తిప్పేస్వామి డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్ సిరాజుద్దీన్, తదితరులు పరిశీలించారు. ప్రస్తుతం యాతాల వంక ద్వారా 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఉండగా, అంతే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందని ఏఈ శ్రీహరి రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టులో జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెండు గేట్ల ద్వారా వంద క్యూసెక్కుల
నీరు విడుదల
నిండిన నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టు


