రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి – చిత్తూరు రోడ్డులోని ఎస్‌ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం నడుచుకుంటూ వెళుతున్న రవి(22) అనే యువకుడిని ఢీకొంది. స్థానికులు గుర్తించి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు సంబేపల్లె మండలం దిన్నెపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ కుళాయప్ప తెలిపారు.
కార్మికుల సమస్యలపై పోరాటం
ఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు.
కోడిపందెం జూదరుల అరెస్టు
పెనగలూరు : మండలంలోని ఎన్‌ఆర్ పురం గ్రామం వద్ద తోటల్లో కోడిపందెం ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రవి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. వారి వద్దనుంచి 36 కోడి కత్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు ఎనిమిది సెల్ ఫోన్లు, రూ.4050లు నగదును సీజ్ చేశామన్నారు.
సీపీఎం విధానాలే
దేశాభివృద్ధికి మార్గదర్శకం
రాయచోటి అర్బన్ : సీపీఎం విధానాలే దేశాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి పేర్కొన్నారు. పలు ఉద్యమాల్లో పాల్గొన్న మండం సుధీర్ కుమార్ సోమవారం సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సుధీర్ కుమార్‌తో పాటు చుక్క వీరభద్ర, వండాడి రెడ్డి సుధాకర్, పులిమి వెంకట రమణ, గాలివీటి రామాంజులు, పండరయ్య, రెడ్డిప్రసాద్, నరసింహులు తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్, పందికాళ్ల మణి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


