మున్సిపల్ అధికారుల అవినీతిపై ఆగ్రహం
రాజంపేట : కూటమి పాలనలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట మున్సిపాలిటీలో అవినీతి పెచ్చరిల్లిపోయింది. రాజంపేటను దోచుకుంటున్నారు.. అంటూ అధికారుల అవినీతిపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా..
పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు సమావేశంలో అధికారుల అవినీతిని ఎత్తి చూపారు. రాజంపేట పట్టణాన్ని చెత్తపట్టణంగా మార్చేశారని ఆరోపించారు. పనుల పురోగతి, వివిధ వార్డులలో పురపాలిక అధికారుల పనితీరును కౌన్సిలర్లు ఎండగట్టారు. పారిశుధ్యం పడకేసిందని కొంతమంది కౌన్సిలర్లు, రోడ్లు సరిగ్గా లేవని మరికొందరు, డ్రైనేజి వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉందని ఇంకొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్‌లో నిలదీశారు. రాజంపేట పట్టణాన్ని చెత్తగా మార్చేశారని, ఫెయిల్యూర్ కమిషనరు అంటూ చైర్మన్ సోదరుడు పోలా రమణారెడ్డి ధ్వజమెత్తారు. కౌన్సిలర్లు పోలా వెంకటరమణారెడ్డి, కూండ్ల రమణారెడ్డి, డొంకా సురేష్, సనిశెట్టి నవీన్, చప్పిడి కళావతి, టీడీపీకి చెందిన తుపాకుల అశోక్‌కుమార్, పసుపులేటి సుధాకర్, మనుబోలు విజయలక్ష్మీ, బీజేపీకి చెందిన రేనాటి రాఘవేంద్ర తదితరులు అధికారుల అవినీతిపై గళం విప్పారు.
సొంత ఆదాయమే..పరమావధిగా..
పురపాలక సంఘానికి ఆదాయం కన్నా.. సొంత ఆదాయమే మిన్న అనే రీతిలో పురపాలక అధికారులు కొనసాగుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. అవుట్‌సోర్స్ సిబ్బంది నియామక వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. చేయి తడిపితే అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో వైస్‌చైర్మన్ సుమియా, నూర్‌బాషా, హసీమా, తాళ్లపాక సిందూరి, సత్యాల మౌనిక, గునుకల బుజ్జమ్మ, రెడ్డిమాసి రాధ, గుజ్జల వసంత, బిల్లా దివ్యతేజ, తోటవాణి, మిరియాల చెంగమ్మ, కటారు హైమావతి, న్యామతుల్లా, కో–ఆప్షన్ సభ్యుడు పిండిబోయని రామ్మోహన్ యాదవ్, ఉమర్ ఫరూఖ్, షంషాద్‌బేగం, వివిధ విభాగాల అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కౌన్సిల్ హాల్‌లో వైస్ చైర్మన్ మర్రి బైఠాయింపు..
ఆర్‌ఐ నియామకంలో కమిషనర్ శ్రీనివాసులు అవినీతికి పాల్పడ్డారంటూ నిరసన తెలుపుతూ మున్సిపల్ వైస్‌చైర్మన్ మర్రి రవికుమార్ కౌన్సిల్‌లో బైఠాయించారు. అనుభవం ఉన్న సుబ్బరాయుడును పక్కనపెట్టి, తనకు అనుకూలమైన, అర్హతలేని వ్యక్తిని ఆర్‌ఐగా నియమించుకున్నారని కమిషనర్‌పై దుమ్మెత్తి పోశారు. ఇంటి నిర్మాణం విషయంలో ఆర్‌ఐ సాయిచరణ్‌రెడ్డి డబ్బులు వసూలు చేశాడంటూ బాధితుడి ఆరోపణను కౌన్సిల్‌లో మొబైల్ ద్వారా వినిపించారు. కలెక్షన్ ఏజెంట్‌గా మారిన ఆర్‌ఐను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల బైపాస్‌లో ఓ వెంచర్ విషయంలో ఆర్‌ఐ అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని, దీనిపై కమిషనర్‌ను అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారన్నారు.
పనితీరు పారదర్శకంగా ఉండాలి..
ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్ జోక్యం చేసుకుంటూ అధికారులు తమ పనితీరును పారదర్శకంగా మెరుగుపరుచుకోవాలని హితబోధ చేశారు. కౌన్సిలర్లతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి వార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయా లని సూచించారు. పురపాలక సంఘానికి ఆదాయం తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రాజంపేట మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల ధ్వజం
అధికారుల అవినీతిని ఆధారాలతో
బట్టబయలు చేసిన వైస్‌చైర్మన్ మర్రి రవి
పార్టీలకతీతంగా గళం విప్పిన సభ్యులు
మున్సిపల్ అధికారుల అవినీతిపై ఆగ్రహం


