సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?
దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగమార్గం కృష్ణపట్నం రైలు మార్గం. రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో ఉన్న ఈ మార్గంలో ప్రయాణించాలని రాయలసీమ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్యాసింజర్ రైలు లేకపోవడంతో వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది.
● దక్షిణ భారతదేశంలో
అత్యంత పొడవైన రైల్వే టన్నెల్
● కడప–నెల్లూరు ప్యాసింజర్ రైలు
నడిపించాలంటున్న జనం
సొరంగ మార్గంలో సరకు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు
అన్నమయ్య జిల్లాలోని రైల్వే సొరంగ మార్గం
ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైలు మార్గం అత్యంత పొడవైనది. ఈ మార్గంలో చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని కొండవద్ద ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో దాదాపు 6.6 కిలో మీటర్ల మేర అతి పెద్ద సొరంగ మార్గం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో 5 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం 11.21 కిలోమీటర్ల మేర జుమ్మూ కశ్మీర్‌లోని పీర్ పంచాలో ఉంది. సొరంగం ఉన్న ఈ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. రాయలసీమ ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది.
రూ.2 వేల కోట్లతో రైలు మార్గం
ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు 1.33 కిలో మీటర్ల రైలు మార్గాన్ని రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2005–2006లో ఈ మార్గం మంజూరుకాగా, 2019 జూన్ 10న తొలి రైలును నడిపించారు. అప్పటినుంచి ఈ మార్గంలో సరకు రవాణా చేసే 25కు పైగా గూడ్స్ రైళ్లు నిత్యం ఈ మార్గంలో నడుస్తున్నాయి. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ తప్ప ప్యాసింజర్లు ప్రయాణించే వీలుగా నిర్మించలేదు. ఈ మార్గంలో కడప నుంచి ఓబులవారిపల్లి మీదుగా రైల్వే అధికారులు ప్యాసింజర్ డెమో రైళ్లు నడిపించాలని ప్రజలు ప్రతిసారీ కోరుతున్నారు. ఈ రైలు నడిపతే కడప–నెల్లూరు మధ్య వాణిజ్యపరంగా, విద్యా పరంగా వ్యాపారం అన్ని విధాలా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేగాక దక్షిణ భారతదేశ అతి పెద్ద సొరంగ మార్గంలో ప్రయాణించాలనే సీమ వాసుల కల నెరవేరుతుంది. రైల్వే అధికారులు స్పందించి ఈ మార్గంలో రైలు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.
సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?


