40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– డీఎఫ్‌ఓ వినీత్ కుమార్
వేంపల్లె : మండలంలోని బోలగొందిచెరువు బీట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్ తెలిపారు. వేంపల్లె అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎరచ్రందనం రవాణాపై నిఘా పెట్టామని, వేంపల్లె ఎఫ్‌ఆర్‌ఓ పర్యవేక్షణలో సిబ్బంది బోలగొందిచెరువు బీట్ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారని తెలిపారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన వ్యక్తులు ఎర్రచదనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్దం చేస్తుండగా దాడులు చేశామన్నారు. వేములగొందికి చెందిన పోతలపల్లె మల్లికొండ, కాయలపల్లెకు చెందిన వీరాంజనేయులు, చినన్న వారిపల్లెకు చెందిన చెన్నకేశవులను అరెస్టు చేశామని, కాయలపల్లెకు చెందిన కలువపల్లె మనోహర్‌నాయుడు పరారీలో ఉన్నారన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. వారి నుంచి రూ.2,13,692 విలువగల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరచ్రందనం స్మగ్లింగ్ చేస్తే సమస్యల్లో పడతారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేసి.. అక్రమ రవాణాపై ఎక్కువగా నిఘా పెట్టామని తెలిపారు. టాస్క్‌ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బందతో కలిసి దాడులు చేసి డంప్‌లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులు, అడవి జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, డీఆర్‌ఓలు సుబ్బయ్య, శేషయ్య, బీవీ.సుబ్బయ్య, ఏబీఓ.శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


