ఉమ్మడి రైస్ మిల్‌ను అమ్మేశారు
రాయచోటి : అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా టీడీపీకి చెందిన పాలకిర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కె.నాగేశ్వరనాయుడు అన్యాయం చేస్తున్నాడని అతని అన్న రామచంద్రనాయుడు, అన్న కుమారుడు ఉమామహేశ్వర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంబేపల్లె మండల కేంద్రంలోని సర్వే నంబర్ 48–2లో ఉమ్మడి ఆస్తి 20 సెంట్ల భూమిలో నిర్మించిన రైస్‌మిల్‌ను నాగేశ్వరనాయుడు అమ్మేశారంటూ అన్న రామచంద్రనాయుడు, కొడుకు ఉమామహేశ్వర్‌లు వాపోయారు. 1989లో గురుమూర్తి, నాగేశ్వరనాయుడు ఇద్దరు కలిసి సిద్దం రాజువద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆస్తి 20 సెంట్లలో 10 సెంట్ల భూమిని గురుమూర్తి వద్ద నుంచి రామచంద్రనాయుడు 1992లో కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ ఆస్తిలో అన్నదమ్ములు ఇరువురు రైస్‌మిల్ ఏర్పాటు చేసుకొని అందులో వచ్చే ఆదాయాన్ని సమంగా పంచుకొనే వాళ్లమని తెలిపారు. ఉద్యోగ రీత్యా రైస్ మిల్ దగ్గర తాను లేకపోవడంతో నాగేశ్వరనాయుడే చూసుకొనేవాడన్నారు. ఆరేళ్ల క్రితం రైస్‌మిల్, లావాదేవీల విషయంలో మనస్పర్థలు రావడంతో రాయచోటి కోర్టులో దావా వేశమని తెలిపారు. నాగేశ్వర నాయుడు 20 సెంట్ల ఆస్తిని తమ పేరు మీద పాస్ పుస్తకం తయారు చేసుకొని అతని భార్య పేరుమీద 10 సెంట్లు భూమిని రిజిస్టేషన్ చేయించినట్లు తెలిపారు. తనకు చెందిన 10 సెంట్ల భూమిలో రైస్‌మిల్ చూపిస్తూ తమ కోడలు పేరుమీద రిజిస్టేషన్ చేయించినట్లు తెలిపారు. పాస్ పుస్తకం రద్దు చేయాలని సంబేపల్లె రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారన్నారు. రైస్ మిల్ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికి అక్టోబర్ 18 వతేదీన గుట్టుచప్పుడు కాకుండా రైస్‌మిల్ సామగ్రిని దాదాపు రూ.50 లక్షలకు అమ్మివేశారని ఆరోపించారు. ఈ విషయమై సంబేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. స్థానిక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.


