
పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
● మంత్రి మండిపల్లి, జిల్లా ఎస్పీ
ధీరజ్ కునుబిల్లి భరోసా
● ఘనంగా అమరవీరుల సంస్మరణ
దినోత్సవం
రాయచోటి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో రాయచోటి పోలీసు పెరెడ్ మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అధ్యక్షత వహించారు. దేశ సేవలో అమరులైన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుష్పగుచ్చాలతో మంత్రి, ఎస్పీ, జేసీలు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రశాంతమైన సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివన్నారు. కుటుంబాలను వీడి, ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రజల రక్షణకు నిలబడడం అసాధారణమైన ధైర్యమన్నారు. అమరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రం, దేశం శాంతి భద్రతలు ఉన్నాయన్నారు. పోలీసు అమరవీరుల త్యాగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మాట్లాడుతూ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని, భయం ఉన్నప్పటికీ చర్య తీసుకోవడం, అది పోలీస్‌కు మాత్రమే సాధ్యమన్నారు. కోవిడ్–19 సమయంలో కర్తవ్య దీక్షతో మన పోలీసులు కనిపించని శత్రువుతో పోరాడారన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజల భద్రతను నిర్ధారిస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం అన్నమయ్య జిల్లాకు చెందిన ఎనిమిది మంది పోలీసులు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు మంత్రి, జిల్లా ఎస్పీలు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
ప్రత్యేక భరోసా..
కార్యక్రమం అనంతరం జిల్లా ఎస్పీ విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లి, రాయచోటి డీఎస్పీలు ఎస్ మహేంద్ర, ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, జిల్లాలోని సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.