
విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని డైట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో 8–12వ తరగతుల వరకు గల విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టపరమైన అవగాహనను పెంపొందించడానికి ‘లైంగిక దాడుల నుంచి మహిళలు మరియు బాలల రక్షణ– విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన, వక్తత్వ పోటీలను నిర్వహించాలన్నారు. ఈ పోటీలు రాయచోటి డైట్, మదనపల్లి జెడ్పీ హైస్కూల్, మన్నూరు జెడ్పీ హైస్కూల్‌లో ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో డివిజన్ వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ఈ నెల 26వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తారన్నారు. అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.