
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : భర్త చేతిలో యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పట్టణంలోని శేషప్పతోటలో నివాసం ఉంటున్న శశికళ(55)కు, ఆర్మీ ఉద్యోగి వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బీటెక్ చదువుతున్న కుమారుడు సుజన్, లండన్‌లో ఎమ్మెస్సీ చేస్తున్న కుమార్తె సాత్విక వర్షిణి ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త వెంకటరమణ తమిళనాడులోని చైన్నెలో ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గత 20 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలను శశికళ పోషించేది. ఈ క్రమంలో ఆమె ఉంటున్న ఇల్లు వెంకటరమణ పేరుపై ఉండటంతో గత కొన్ని నెలలుగా ఇంటిని ఖాళీ చేయమని భర్త శశికళను వేధించసాగాడు. ఇదే విషయమై ఈనెల 6న వెంకటరమణ తన సోదరుడు రాజన్నతో కలిసి ఇంటివద్దకు వచ్చి శశికళపై దాడిచేసి యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, ఆమె కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం కుటుంబ సభ్యులు బాధితురాలిని తిరిగి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి శశికళ మృతి చెందింది. అయితే, యాసిడ్ దాడి ఘటనలో నిందితుడైన ఆమె భర్త వెంకటరమణను ఇప్పటికే టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శశికళ మృతి చెందడంతో హత్యాయత్నం ఘటనను, హత్య కేసుగా మార్పు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు.