
స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ
రాజంపేట టౌన్ : ఇటీవల కడపలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పొటీల్లో రాజంపేటకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో సగిలి రావణ రింక్‌రేస్–1, రేస్–2లో గోల్డ్‌మెడల్ సాధించాడు. అలాగే సగిలి సంఘమిత్ర రింక్‌రేస్–1లో రజత పతకం సాధించింది. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించడంతో రావణ, సంఘమిత్ర త్వరలో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రావణ, సంఘమిత్రలు అక్కా తమ్ముళ్లు కావడం విశేషం.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని వేంపల్లె పంచాయతీ రాగిమాకులపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, శారదమ్మ దంపతులు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమ పొలంలో ఆవుల షెడ్ నిర్మించుకోవాలని విశ్వనాథ్‌రెడ్డి, అతడి కుమారుడు నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన నగదు కోసం తమ పొలం పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని శారదమ్మతో చర్చించారు. అయితే ఆమె పొలం తాకట్టు పెట్ట వద్దని భర్తతో గొడవ పడింది. మనస్తాపం చెంది ఈనెల 19న ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విష జ్వరంతో మహిళ..
మదనపల్లె రూరల్ : విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని కమ్మవీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు భార్య ఉమాదేవి(54) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందింది. మంగళవారం తీవ్ర జ్వరంతో పాటు విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో డాక్టర్లు చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

స్కేటింగ్ పోటీల్లో అక్కాతమ్ముళ్ల ప్రతిభ