
డీఏ అర్థాన్ని మార్చేసిన కూటమి ప్రభుత్వం
లక్కిరెడ్డిపల్లి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక డీఏను మాత్రమే దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3.64 శాతంగా ప్రకటించడం పట్ల పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సూర్యుడు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉత్తర్వు సంఖ్య 60, 61లో డీఏ అంటే డెత్ ఆఫ్టర్ లేదా రిటైర్మెంట్ ఆఫ్టర్ అని సరికొత్త నిర్వచనం ఇవ్వడం సరికాదన్నారు. కరువు భత్యం అంటే కాటికి పోయాక వచ్చేది కాదని, కాలానుగుణంగా వచ్చేదన్నారు. కనుక అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా దీనిని వెంటనే సవరించాలన్నారు. లేకుంటే పోరు తప్పదన్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు కరువు భత్యంలో 90 శాతం క్యాష్ రూపంలోను, పెన్షనర్స్‌కు అరియర్స్ రూపంలో విడతల వారిగా సర్వీసులో ఉండగానే చెల్లించాలని, ఓపీఎస్ ఉద్యోగులకు తక్షణమే పీఎఫ్ ఖాతాలో జమ అయ్యేలా ఉత్తర్వులు మార్చాలని కోరుతూ దేవులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైకం గంగిరెడ్డి, ఉపాధ్యాయులు నాగరాజు, కృష్ణంరాజు, రెడ్డెయ్య, భాస్కర్, రాణి, నాగరత్నం, రామాంజి, రవి, రామ్మోహన్, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.