
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువు మండలం దేవరచెరువుకు చెందిన అమరనాథ్(23), నజీర్(23), పత్తికోటకు చెందిన మల్లికార్జున(24) ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంలో తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్ట్ సందర్శనకు సోమవారం వెళ్లారు. తిరిగి బయలుదేరి వస్తుండగా, మార్గమధ్యంలోని తంబళ్లపల్లె సమీపంలో ఆటోను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తీసుకువచ్చారు. వీరిలో అమరనాథ్‌కు కాలు విరగ్గా, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
టెంపో ఢీకొని..
టెంపో ఢీకొని సోమవారం బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లెలోని ఇసుకనూతిపల్లెకు చెందిన జాకీర్‌బాషా, రీహానా దంపతుల కుమారుడు మహమ్మద్ షాకిర్(6) ఇంటిలో నుంచి రోడ్డుకు అవతలి వైపున ఉన్న అవ్వ దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన టెంపో ఢీకొంది. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొని..
కారులో వస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు మరో ముగ్గురు గాయపడిన ఘటన పెద్దమండ్యం మండలంలో జరిగింది. గాలివీడు మండలం ప్యారంపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జగదీష్(30) తన స్నేహితుడు సాయిచరణ్(26)తో పాటు గాలివీడుకు చెందిన పుల్లారెడ్డి(31), స్రవంతి(30)తో కలిసి మంగళవారం బెంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొని..
బైక్‌పై వెళుతున్న యువకుడిని మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. రాజమండ్రికి చెందిన ప్రసాదరావు కుమారుడు సునీల్(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తట్టివారిపల్లెలో ఉన్న యజమాని వద్దకు ద్విచక్రవాహనంలో బయలుదేరి వెళుతుండగా, మున్సిపల్ బోర్డు వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు