చిట్టెంవారిపల్లిలో ఘర్షణ
రామసముద్రం : మండలంలోని మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లిలో స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన నారాయణ స్వామి తన స్థలంలో గోడ నిర్మాణం చేశాడని అదే గ్రామానికి చెందిన కమ్మన్న ఇరువురు ఘర్షణ పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కమ్మన్న, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. అదే గ్రామానికి చెందిన నారాయణ స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహన పూజకు వెళుతూ..
మదనపల్లె రూరల్ : వాహన పూజకు వెళుతూ ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని యువకుడు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చింతయ్యగారికోటకు చెందిన రవి, పాపులమ్మ దంపతుల కుమారుడు తేజ(21) తన స్నేహితుడు జగదీష్(20)తో కలిసి ద్విచక్రవాహనంలో పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయానికి వాహన పూజ కోసమని బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలోని మదనపల్లె బైపాస్‌రోడ్డు నిమ్మనపల్లె సర్కిల్ వద్ద వేంపల్లెకు చెందిన సంతోష్(22), ప్రేమ్(21) మరో ద్విచక్రవాహనంలో పట్టణం నుంచి ఇంటికి వెళుతూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో తేజ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవార్త తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


