
మానవ తప్పిదమే
● హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఉండగా విద్యుత్ సరఫరా ఎందుకు ఆగింది
● ట్రిప్ కావడానికి కారణాలేమిటి?
● హంద్రీ–నీవా అధికారులు నీటితరలింపునకే పరిమితమై, వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారా
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం తరిగోడు ఎత్తిపోతల పథకం సమీపంలో పుంగనూరు ఉపకాలువపై 110.950 కిలో మీటర్ (గుండ్లపల్లె) వద్ద గండిపడి తెగిపోవడానికి మానవ నిర్లక్ష్యం ఉందని పలు అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీసత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె జలాశయం నుంచి కృష్ణా జలాలను కుప్పానికి తరలిస్తున్నారు. ఈ కాలువసాగే మార్గంలో మండలంలోని తరిగోడు సమీపంలోని గుండ్లపల్లె వద్ద బుధవారం ఉదయం కాలువ తెగిపోయింది. దీనికి కారణం మంగళవారం రాత్రి మెరుపులతో తరిగోడు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసే లైన్ దెబ్బతిని సరఫరా ఆగిందని అంటున్నారు. అయితే అసలు ఏమి జరిగింది, కాలువ తెగకుండా లేదా తెంపాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఒక చోట ఎత్తిపోతల పథకం ఆగితే పైనున్న పథకాలు ఆటోమెటిక్‌గా ఆగిపోవాలి. ఇందులో ఏది జరగలేదు. ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనుమానాలెన్నో..
విద్యుత్ సరఫరాలో అంతరాయంవల్ల తరిగోడు ఎత్తిపోతల పథకం పనిచేయలేదని హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో స్పష్టత లేదు. విద్యుత్ సరఫరా లైన్‌లో అంతరాయం కలగడానికి సరఫరా ఓవర్‌లోడ్, తీగలపై చెట్ల కొమ్మలు పడటం, ఇన్స్‌లేటర్ పగిలిపోవడం లాంటి కారణాలు ఉంటాయి. ఇక్కడ అధికారులు పిడుగుపడిందని, దానివల్లే ఇన్స్‌లేటర్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పిడుగు పడటం తమకు తెలియదని సమీప గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో లైన్ ఎలా దెబ్బతింది, నిర్వహణ సక్రమంగా లేదా, సమస్యను ముందే గుర్తించలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతుండగా, ఎత్తిపోతల పథకం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా సాంకేతిక సమస్య ఉన్నట్టు చెబుతున్నారు. ఇది కూడా కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తెగినచోటే తెగింది
ఇప్పుడు కాలువతెగిన చోటనే గతంలోనూ కాలువ తెగిందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. తరిగోడు పథకం ఆగిన తర్వాత ఇప్పుడు కాలువ తెగిన పైప్రాంతంలో తెంపి నీటిని మళ్లించాలని ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఒకసారి తెగిన చోటనే కాలువ మళ్లీ తెగిపోయి గండిపడింది. దీన్ని పరిశీలిస్తే ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీళ్లు వదలకముందు కాలువ పటిష్టతపై సన్నద్ధం కావాలి. అయితే అలాంటి చర్యలు చేపట్టినట్టు కనిపించడం లేదు. దానిఫలితమే కాలువకు తెగి గండిపడినట్టు స్పష్టం అవుతోంది. నివాసప్రాంతాలు లేనిచోట కాలువ తెగడంతో ప్రమాదం తప్పింది.
ఎస్కేప్ సిస్టం లేదు
ఎగువనుంచి కాలువలో నీటి ప్రవాహం ఆగనప్పుడు కాలువ పక్కన చెరువు లేదా వాగులు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ కాలువను తెంపి నీటిని మళ్లించాలి. అయితే ప్రస్తుతం కాలువ తెగినచోటనే చెరువు ఉండటంతో నీళ్లు అందులోకి ప్రవహించి నిండాక మరో చెరువులోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రతి పంపింగ్ స్టేషన్ (ఎత్తిపోతలు)కి ముందు దగ్గరలో ఉన్న వంకలు, వాగులు, చెరువులను కలిపే విధంగా ఒక ఎస్కేప్ స్ట్రక్చర్ (అధికంగా వచ్చే నీళ్లను వంకలకు మళ్లించే సేఫ్టీ వ్యవస్థ) నిర్మించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది కాలువ మొత్తానికి ఎక్కడా అనుసరించలేదు. దానికి గుండ్లపల్లె వద్ద తెగి గండిన కాలువే నిదర్శనం.
గుండ్లపల్లె వద్ద తెగి గండి పడి కాలువ నుంచి బయటకు ప్రవహిస్తున్న నీళ్లు గండి పూడ్చేందుకు మొదలైన పనులు
ఒకే లైన్ లో కాలువమీద పంపులు ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా పంప్ స్టేషన్ (ఎత్తిపోతలు) ఆగిపోయి మిగతావి పని చేస్తుంటే నీరు వస్తూనే ఉంటుంది.. అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ మోటార్ చెడిపోయినా ఆ పంపు స్టేషన్ స్టాండ్‌బైగా ఉన్న వేరే పంపు స్టార్ట్ అవుతుంది. ఇదిలేదు.
సిరిస్‌లో ఉన్న పంపులకు సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజేషన్ (స్కడ) ఎలక్ట్రో మెకానిల్ టెండర్‌లోనే సాధారణంగా పొందుపరిచి ఉంటారు. అలాంటి వ్యవస్థ ఉంటే (తరిగోడు ఎత్తిపోతల పథకం సమీపంలోని గుండ్లపల్లె వద్ద కాలువ తెగిపోయి గండిపడటం) ఇంతటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఈ విషయంలో మెకానికల్ పనుల ఒప్పందాలను అధికారులు పరిశీలించాల్సి అవసరం ఉంది.
స్కడ వ్యవస్థ సెన్సార్లు, పంపులు, వాల్వ్‌లు వంటి పరికరాల నుండి వాస్తవ డేటాను సేకరించి కంప్యూటర్‌కు పంపుతాయి. ఇందులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్‌లు, మానవ, యంత్ర అనుసంధానత కలిగి ఉంటాయి. ఇవి అందించే సమాచార వ్యవస్థతో ఆపరేటర్లు ఈ సమాచారాన్ని విశ్లేషించి, ప్రమాదాలను నియంత్రించడానికి నిర్ణయాలు తీసుకుంటారు, ఉదాహరణకు..పంపులను ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటివి.
ఎస్కేప్, స్కడ లేవు
హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సంబంధించి ఎస్కేప్, స్కడ అమలు చేయలేదు. వీటి అవసరం ఇప్పుడు గుర్తించాం. దీనికి సంబంధించిన చర్యలను చేపడతాం. తరిగోడు వద్ద కాలువ తెగిన చోట గతంలోనూ తెగిందని గుర్తించాం. కాలువలో నీళ్లు పూర్తిస్థాయికి చేరి పోర్లుతున్న సమయంలో పైనున్న కాలువను తెగ్గోట్టేందుకు ప్రయత్నించాం. ఈలోగా గండిపడింది.
–విఠల్‌ప్రసాద్, ఎస్‌ఈ, హంద్రీ–నీవా ప్రాజెక్టు

మానవ తప్పిదమే