
జీఎస్టీ 2.0తో ప్రజలకు లబ్ధి
రాయచోటి: ఒకదేశం–ఒక పన్ను అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు అమల్లోకి వస్తున్న జీఎస్టీ 2.0 దేశంలోని అతి పెద్ద ఆర్థిక సంస్కరణల్లో ఒకటని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో గురువారం రాయచోటిలోని శివాలయం సర్కిల్ నుంచి నేతాజీ సర్కిల్ (బంగ్లా) వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ నిశాంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ 2.0 వల్ల కలిగే లబ్ధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. దీని ద్వారా 99 శాతం వస్తువులపై పన్ను రేట్లు తగ్గి ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు. టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, డీటీఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రవి, అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సౌమ్య పాల్గొన్నారు.
● విద్య, వైద్య, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సత్ఫలితాలి సాధించాలని, జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. రాయచోటిలోని కన్వెన్షన్ హాల్‌లో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ‘‘ఆరోగ్యవంతమైన మహిళా – శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది’’ అనే అంశంపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మాసోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో ఊబకాయం, మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏ విధంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు దీని గురించి ఈ ఇయర్ థీమ్ పెట్టినట్లు వివరించారు. జిల్లా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ మెమెంటోలను అందించారు. అనంతరం పౌష్టికాహారం స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి, నగరపాలక సంస్థ కమిషనర్ రవి, ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ కోటేశ్వరమ్మ, జీసీడీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.