
ఒంటిమిట్ట : మండలంలోని ఒంటిమిట్ట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అట్లూరు మండలం కోనరాజుపల్లికి చెందిన బత్తల శ్రీను (38)ను ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వెనుకవైపు గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీను మృతిచెందారు. పోలీసులు విచారిస్తున్నారు.
చోరీ కేసులో ఇరువురికి జైలుశిక్ష
పుల్లంపేట : దొంగతనం కేసులో ఇరువురికీ న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2020 అక్టోబర్, 7న స్థానిక బైపాస్ రోడ్డులోని నాయుడు హోటల్ వద్ద కడపకు చెందిన సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ బజులు ఆటోను చోరీ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం మంగళవారం నందలూరు జడ్జి ఉదయ్ ప్రకాష్ నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.
వైద్యుల సమ్మెకు ఆశాల సంఘీభావం
రైల్వేకోడూరు : రైల్వేకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సమ్మె చేస్తున్న వైద్యులకు మంగళవారం ఆశ వర్కర్ల యూనియన్‌లు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహిస్తున్న ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం కళ్లు తెరిచి వైద్యుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు యాదరాజు గంగాధర్, జిల్లా కన్వీనర్ రత్నమ్మ, చెంగమ్మ, యశోద, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
కలకడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పెద్దసుబ్బయ్య కుమారుడు రమణయ్య(65) కె.బాటవారిపల్లెలో టమాట సాగు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి చేరుకుంటున్న సమయంలో పీలేరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ రమణయ్య పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందినట్లు వైధ్యులు తెలిపారు. పోలీసులు వాహనాన్ని కలకడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.