
ఆస్తి రాసిస్తే.. ఆదుకోనంటోంది..
జమ్మలమడుగు రూరల్ : వృద్దాప్యంలో తమను ఆదుకుంటుందనే ధీమాతో ఆస్థి రాసిచ్చాం.. ఇపుడు ఆదుకోము.. ఆస్తి వెనక్కు ఇవ్వమని చెప్పడం న్యాయం కాదని ఓ వృద్ధురాలు ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు అర్డీఓ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గూడురు నాగయ్య, భార్య వెంకటలక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. అందరినీ ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు. ఆస్తి అంతా వారికే ధారపోసి ఓ ఇంటిని తమకోసం ఉంచుకున్నారు. ఇపుడు వారు వృద్ధాప్యంలోకి అడుగిడడంతో తమకు అసరా కావాలని, తమను పోషిస్తే మోడంపల్లెలోని సొంత ఇంటిని వారి పేరిట రాసిస్తామని చెప్పారు. ఈ ఒప్పందానికి ముందుకు వచ్చిన రెండో కూదురికి ఇంటిని రాసి ఇచ్చారు ఆ వృద్ద దంపతులు. కొన్ని నెలల తర్వాత వీరిని ఆదుకోకుంటూ ఆ కూతరు చేతులెత్తేసింది. కుమార్తె పట్టించుకోకపోవడం... ఇల్లు లేకపోవడంతో ఆ వృద్ధులు జమ్మలమడుగు ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులంతా ఆర్డీఓ ఎదుట హజరయ్యారు. ఇక్కటే అసలు కథ మొదలైంది. ఆ ఇంటికి తగిన ధర చెల్లించి కోనుగోలు చేశానంటూ కుమార్తె చెప్పడంతో ఆర్డీఓ తల పట్టుకోవాల్సి వచ్చింది. తమను పోషించాలి.. లేకపోతే ఇంటిని వెనక్కు ఇస్తే అక్కడే ఉంటామని వృద్ధులు ఆర్డీఓకు చెప్పారు. ఇరువురూ వాదించుకుంటుండడంతో ఏమి చేయాలో తోచక తదుపరి వారానికి వాయిదా వేశారు. నలుగురు కుమార్తెలున్నా.. ఆ వృద్ధ దంపతులకు చట్టం ఏ మేరకు సహాయం అందుతుందో మరి.
ఆర్డీఓ ఎదుట వృద్ధ దంపతుల ఆవేదన