మదనపల్లె : భార్యపై భర్త దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శేషప్పతోటలో కాపురం ఉంటున్న కేవీ రమణ భార్య శశికళ (50) గత 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. పిల్లలకు వివాహమై స్థిరపడ్డారు. ఈ క్రమంలో తరచూ కేవీ రమణ భార్య కోసం ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వారి మధ్య ఏం జరిగిందో కానీ ఉదయం శశికళ వంట చేస్తుండగా భర్త, మరిది దాడి చేసి గాయపరిచారు. బాధితురాలిని స్థానికులు వైద్యం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కారు ఢీకొని రైతు దుర్మరణం
కురబలకోట : మండలంలోని దొమ్మన్నబావి సర్కిల్ వద్ద సోమవారం కారు ఢీకొన్న సంఘటనలో తూగువారిపల్లెకు చెందిన రైతు రఘునాథరెడ్డి (55) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తూగువారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి మరో ఇద్దరితో కలసి మోటార్ సైకిల్‌పై అంగళ్లు వైపు రాసాగాడు. దొమ్మన్నబావి సర్కిల్ వద్ద బైపాస్ మీదుగా వేగంగా వస్తున్న కారు వీరిపైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది. వేగంగా ఢీకొంది. దీంతో రైతుకు తీవ్ర గాయాలై రెప్పపాటులోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనుక కూర్చుని వస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా వారు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
యువకులకు గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట కట్టాపుట్టాలమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారిపై బొమ్మవరానికి చెందిన వెంకటరమణ, శంకర సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా తిరుపతికి వెళ్తున్న కారు ఢీకొని తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని హుటాహుటిన కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్సై లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.