
స్వాదీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు
మదనపల్లె : అంతర్‌రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసినట్టు స్థానిక డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. సోమవారం మదనపల్లె తాలూకా సీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన పులి వెంకటరెడ్డి (33) బైక్‌ల చోరీలకు పాల్పడ్డాడు. అన్నమయ్య, తిరుపతి, కర్ణాటకలోని కోలారు జిల్లాల్లో 25 బైక్‌లను చోరీ చేశాడు. రెండేళ్లలో మదనపల్లె, పీలేరు, కలికిరి, బి.కొత్తకోట, ముదివేడు, పెద్దతిప్పసముద్రం మండలాలు, కోలారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేశాడు.
కర్ణాటకలో చోరీ చేసిన బైక్‌లను ఆంధ్రాలో.. ఆంధ్రాలో చోరీ చేసిన బైక్‌లను కర్ణాటకలో విక్రయిస్తున్నాడు. దీనిపై నమోదైన కేసులతో నిందితునిపై పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం మదనపల్లె బసినికొండ వద్ద ఓ బైక్‌ను చోరీచేసే ప్రయత్నంలో ఉండగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బైక్‌ల దొంగతనాలు వెలుగులోకి వచ్చాయని, నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.

నిందితుడిని హాజరు పరిచిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ