
కోర్టు ఆర్డర్ సాకుతో.. రూ.20కోట్ల స్థలం..కబ్జాకు యత్నం
● అక్రమంగా పొజిషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం
● అడ్డుకున్న తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది
కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణకు యత్నించిన ప్రభుత్వ స్థలం
తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదం చేస్తున్న టీడీపీ నాయకులు.
మదనపల్లె రూరల్ : కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దొడ్డిదారిన ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్ల కుట్ర బట్టబయలైంది. కొన్నేళ్లుగా గుబురుపొదలు, పిచ్చిచెట్లు, ముళ్లకంపలతో చిన్నపాటి అడవిని తలపించేలా ఉన్న ప్రభుత్వ భూమిని, కోర్టు ఆర్డర్ సాకుతో తమ అనుభవంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే, స్థానికుల ఫిర్యాదుతో మండల తహసీల్దార్ రంగంలోకి దిగి అడ్డుకుని, ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసిన ఘటన మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో జరిగింది. మండల తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు..కోళ్లబైలు పంచాయతీలోని 598/3, 599/2 సర్వే నంబర్లలో భూమిని కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారని, దీనికి సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించామన్నారు. భూములకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తే...2004కు ముందు వలిపి కుటుంబసభ్యులకు ఇందులో అసైన్‌మెంట్ పట్టా జారీ అయిందన్నారు. 2004 తర్వాత దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ భూమికి ఎస్టీ సంఘం పేరుతో కొందరు వ్యక్తులు హౌసింగ్ కాలనీకి మంజూరు చేయాల్సిందిగా 2004, 2016లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. అయితే, 2011–12లో రెవెన్యూ రికార్డుల వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ ప్రక్రియలో, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ పొరపాటుగా వలిపి కుటుంబసభ్యుల పేరుతో నమోదుచేశారన్నారు. దీంతో గతంలో వారు భూమిని దున్నేందుకు ప్రయత్నిస్తే, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారన్నారు. హైకోర్టు చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా తమను ఆదేశించిందన్నారు. ఆదివారం ఉదయం భూమిని చదును చేస్తుండగా సంబంధిత వీఆర్వోలు అడ్డుకుంటే కోర్టు ఆర్డర్ చూపారన్నారు. అయితే వారు చూపుతున్న ఆర్డర్ కాపీ కోర్టు నుంచి తమకు అందలేదన్నారు. వారు చూపిన కోర్టు ఆర్డర్‌లో పిటిషన్‌దారుడు పొజిషన్‌లో ఉంటే... వ్యవసాయభూమి అనుభవాన్ని భంగపరచవద్దని, అడ్డుకోవద్దని ఉందన్నారు. వాస్తవానికి, పిటిషనర్ పొజిషన్‌లో లేడని, భూమి మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, గుబురు పొదలతో నిండిపోయి ఉందన్నారు. కోర్టు ఆర్డర్‌ను చూపి, పిటిషనర్ పొజిషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో అడ్డుకున్నామన్నారు. భూమి ప్రభుత్వానికి చెందినది కావడంతో ఆక్రమణదారుడికి నోటీసులు అందజేసి, రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వస్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా చదునుచేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదుచేసిన వారిలో కోళ్లబైలు పంచాయతీ టీడీపీ ఇన్‌చార్జి రాటకొండ శ్రీనివాసులునాయుడు, రెడ్డి రాయల్‌లు ఉన్నారు.
ఆక్రమణకు టీడీపీ నాయకుల అండ...
కోళ్లబైలు పంచాయతీలో కోట్ల విలువైన ప్రభుత్వభూమి ఆక్రమణ వెనుక టీడీపీ నాయకుల హస్తం బయటపడింది. ఆక్రమణదారులకు మద్దతుగా టీడీపీ మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, నాయకులు మేకల రెడ్డిశేఖర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ప్రకారం భూమి తమవారిదేనని, చదును చేయవద్దనేందుకు మీరు ఎవరని వాదులాటకు దిగారు. పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి తహసీల్దార్ రాజకీయాలతో పనిలేదని, కోర్టు ఉత్తర్వుల్లో కనపరిచిన ప్రకారం పొజిషన్‌లో లేనందున ప్రభుత్వస్థలం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు.

కోర్టు ఆర్డర్ సాకుతో.. రూ.20కోట్ల స్థలం..కబ్జాకు యత్నం