
రేపు వాల్మీకి జయంతి
రాయచోటి జగదాంబసెంటర్ : వాల్మీకి జయంతి వేడుకలను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు తెలిపారు. రాయచోటి పట్టణం బస్టాండ్ రోడ్డులో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం, వాల్మీకి మహర్షి సేవా స్మరణ జరుగుతుందని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి వాల్మీకి బంధువులు పాల్గొని జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
గంగమ్మకు బోనాల సమర్పణ
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బోనాలు సమర్పించి, తలనీలాలు అర్పించారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్‌సీసీలో జాతీయ స్థాయిలో రజత పతకం
కురబలకోట : అంగళ్లు మి ట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్‌సీసీ క్యాడెట్ కె. ఇస్సాక్ ఎనోస్ జాతీయ స్థాయి జడ్జింగ్ డెస్టెన్స్, ఫీల్డ్ సిగ్నల్స్ పోటీలో రజత పతకం సాధించినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. ఆలిండియా స్థాయిలో న్యూఢిల్లీలో ధాల్ సైనిక్ క్యాంప్‌లో పోటీలు జరిగాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 91 మంది క్యాడెట్లతో కూడిన డైరెక్టరేట్ పోటీదారులు అధ్బుత ప్రదర్సన చేశారన్నారు. ఇందులో మిట్స్ ఎన్‌సీసీ క్యాడెట్ కె. ఇస్సాక్ ఎనోస్ భాగస్వామి కావడం గర్వంగా ఉందని చాన్స్‌లర్ ఎన్. విజయబాస్కర్ చౌదరి తెలిపారు. వరుసగా 11 క్యాంపుల్లో పాల్గొని ఈ ఘనత సాధించినట్లు తెలిపారు.క్యాడెట్ తల్లిదండ్రులు కె. ఎస్తేర్ రాణి, కె. జెర్మియాను కూడా అభినందించారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి : ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 6వ తేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మదనపల్లె సిటీ : జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.భాస్కరన్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా పిఎల్.ఎన్.శాస్త్రి, గౌరవ అధ్యక్షుడిగా వెంకటశివయ్య, డివిజనల్ కార్యదర్శులుగా హేమంత్‌కుమార్(మదనపల్లె),రాజంపేట పి.వెంకటేశ్వర్లు,పీలేరు రెడ్డిశేఖర్‌రెడ్డి, రాయచోటి రామయ్యను ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శులుగా కె.మురళీధర్, శ్రీధర్‌కుమార్, మహిళా కార్యదర్శిగా పార్వతి, ఉపాధ్యక్షులుగా జగన్‌మోహన్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రాజయ్య, కె.భాస్కర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా స్థాయి అకడమిక్ టీం అధ్యక్షుడిగా ఆంజనేయులు, సభ్యులుగా అన్వర్‌సాధత్, వెంకటసుబ్బయ్య, శివప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులుగా వరప్రసాద్, రమేష్‌రెడ్డి ఎన్నికయ్యారు.

రేపు వాల్మీకి జయంతి

రేపు వాల్మీకి జయంతి