
బెల్ట్ షాపులను మూయించండి
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశం
కురబలకోట : మద్యం బెల్ట్ షాపులను వెంటనే మూయించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే శాంతి భధ్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీస్ యంత్రాగాన్ని ఆదేశించారు. ఆదివారం ఆయన ముదివేడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ స్థలాన్ని సర్వే చేయించి చుట్టూ కంచె వేయాలని సూచించారు. రికార్డులు, సీడీ పైళ్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. పీజీఆర్‌ఎస్ పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి మంగళవారం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళ గస్తీ పెంచాలన్నారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ముదివేడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతన్నాయని దీని నియంత్రణకు సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగళ్లు నియోజక వర్గ కూడలిగా ఉన్నందున పరిసరాల్లో సీసీ కెమెరాలు యుద్ధప్రాతిపధికన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌ఐ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.