
నకిలీ మద్యం కేసులో దిద్దుబాటు చర్యలు
● సాక్షి కథనాలతో ప్రభుత్వంలో కదలిక
● తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి
జయచంద్రారెడ్డి, పీటీఎం నేత
కట్టా సురేంద్ర నాయుడులు
పార్టీ నుంచి సస్పెన్షన్
మదనపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం రాకెట్ కేసు వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం ఎకై ్సజ్ శాఖ దాడులతో నకిలీ మద్యం రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో సూత్రధారులైన టీడీపీ నేతలను తప్పించి అమాయకులను బలి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై‘సాక్షి’వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో తప్పించుకోలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం మండలానికి చెందిన సీనియర్ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నిందితులపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తొలి రెండు రోజులు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. అక్కడ పనిచేస్తున్న కూలీలపై కేసు నమోదు చేసింది. సూత్రధారులు ప్రస్తావన తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనం ప్రభుత్వ, పార్టీ పరంగా కదిలిక తీసుకొచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందన కనిపించలేదు. సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జయచంద్రారెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో చంద్రబాబు ఆదేశాలతో రాత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తమదాకా వస్తుందనే..
ములకలచెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారం ప్రభుత్వ మెడకు చుట్టుకుంటోందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు సమస్య తమదాకా రానివ్వకుండా చర్యలకు ఉపక్రమించారని తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని పదేపదే ఆరోపణలతో, అవాస్తవాలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసి మద్యాన్ని విక్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రమంతా తీవ్రమైన చర్చకు దారితీసింది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం కంటే.. ఈ నకిలీ మద్యం తయారీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారం ఎంత దూరం తీసుకెళ్తుందో అన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తం అయింది. దీంతో ఆలస్యం చేయకుండా ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులపై పార్టీపరంగా వేటు పడేలా చేసింది.
● పీటీఎం మండలానికి చెందిన టిడిపి సీనియర్ నేత కట్టా సురేంద్ర నాయుడు తొలుత జయచంద్రారెడ్డితో విభేదించి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనతో కలిసిన పాపానికి కల్తీ మద్యం కేసులో ఇరుక్కోవడమే కాకుండా, పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యాడు.
సురేంద్ర నాయుడు
జయచంద్రారెడ్డి

నకిలీ మద్యం కేసులో దిద్దుబాటు చర్యలు