
వరుస చోరీలతో వ ణ ుకుతున్న గుర్రంకొండ
గుర్రంకొండ పట్టణం వరుస చోరీలతో వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఓ వైపు గంజాయి ముఠా సభ్యులు మరోవైపు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తుల సంచారంతో పట్టణ ప్రజలు హడలెత్తిపోతున్నారు.
గుర్రంకొండ : పట్టణంలో దుండుగులు యథేచ్చగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణం వ్యాపా ర కేంద్రంగా ఆభివృద్ధి చెందుతోంది. దీంతో స్థానికంగా నివాసం ఏర్పాటుచేసుకొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మిచుకొంటున్న ఇళ్లతోపాటు గ్రామానికి శివారు ప్రాంతాల్లో నివాసముండే ఇళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాణంలో ఉండే ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నామి. పది రోజుల కిందట స్థానిక బలిజగడ్డవీధిలో ని నాలుగు ఇళ్లలో వరుసగా రెండురోజులపాటు దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. స్థానిక వైన్ షాపుపై భాగాన్ని కత్తిరించి మద్యం సీసాలను చోరీ చేశారు. బస్టాండులోని పలు దుకాణాల్లో వరుస చోరీలు జరిగాయి. పలు దుకాణాల పైకప్పులను కత్తిరించి చోరీలకు పాల్పడ్డారు. పట్టణంతో పాటు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
పట్టణ శివారు ఇళ్లే టార్గెట్
పలువురు దుండగులు పట్టణ శివారులోని ఇళ్లనే ఎక్కువగా టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి నిర్మాణం వద్ద వస్తువులు ఉంచాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. పలువురు రాత్రిళ్లు కాపలా ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటితోపాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకున్న చోట ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు, ఇళ్ల పరిసరాల్లో ఉంచిన వస్తువులను రాత్రిళ్లు చోరీ చేస్తున్నారు. రాత్రిళ్లు పట్టణ శివారు ప్రాంతాల్లో సంచరించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులతోపాటు గంజాయి మత్తుకు అలవాటు పడిన పలువురు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. గతంలో వీరు పలుమార్లు చోరీ చేసిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. వాటికి సంబంధించి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్‌స్టేషన్‌కు చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. చోరీలు జరిగినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు పలువురు భయపడి మిన్నుకుండిపోతున్నారు. దీంతో దుండుగులు పట్టణంలో యథేచ్చగా చోరిలకు పాల్పడుతుండడం గమనార్హం.
మహిళలకు తప్పని వేధింపులు
పట్టణంలోని మహిళలకు పలు రకాలుగా వేధింపులు తప్పడం లేదు, కొంతమంది సెల్‌ఫోన్‌లో మహిళల ఫొటోలు తీస్తూ వికృతానందం పొందుతున్నారు. మరో వైపు గంజాయి ముఠా సభ్యులు వీధుల్లో వేగంగా వాహనాలను నడపుతూ అడ్డు వచ్చిన మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. మహిళలు వీధుల్లో సంచరించాలంటే భయపడుతున్నారు. ఇటీవల ఓ కామాంధుడు కొత్తపేట వీధిలో సంచరిస్తూ వీధుల్లో నడిచి వెళుతున్న మహిళల ఫొటోలు రహస్యంగా తీయసాగాడు. వీధి వెంబడి వెళుతున్న ఓ మహిళ అనుమానం కలిగి సదరు వ్యక్తి సెల్ ఫోన్‌ను లాక్కొంది. పరిశీలించగా అందులో తన ఫొటోలు ఉండడం గమనించి గట్టిగా నిలదీసింది. సరైన సమాధానం చెప్పకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కొంతమంది అతడి సెల్‌ఫోన్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించగా పలు ప్రాంతాల మహిళల ఫోటోలు అందులో ఉండడంతో నివ్వెరపోయారు. కొందరు మహిళల ఫొటోలు వివిధ భంగిమల్లో తీసి ఉండడం గమనించారు. అతడి సెల్ ఫోన్‌లో సుమారు 500 మహిళల ఫోటోలు ఉండడం గమనార్హం. ఇందులో బస్టాండులో వివిధ దుకాణాల్లో పనిచేసే మహిళల ఫొటోలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీటిని తీయ డం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదు. దీనివెనుక ఎవరైనా ముఠా సభ్యులున్నారా అన్న కోణంలో పట్టణవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, మహిళలు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అప్పగించారు. ధైర్యంగా ఫిర్యాదు చేయలేదనే నెపంతో సదరు కామాంధుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
చర్యలు తీసుకొంటాం
పట్టణంలో జరుగుతున్న చోరీలపె గట్టి నిఘా చేపట్టి చర్యలు తీసుకొంటాం. చోరీలకు గురైన ఇళ్లకు సంబంధించి యజమానులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలి.
– గజేంద్ర, స్టేషన్ ఇన్‌ఛార్జి, గుర్రంకొండ
చెలరేగిపోతూ చోరీలకు పాల్పడుతున్న దుండగులు

వరుస చోరీలతో వ ణ ుకుతున్న గుర్రంకొండ