మిథున్‌రెడ్డి అరెస్ట్‌లో వేధింపులే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మిథున్‌రెడ్డి అరెస్ట్‌లో వేధింపులే లక్ష్యం

Sep 27 2025 5:09 AM | Updated on Sep 27 2025 5:09 AM

మిథున్‌రెడ్డి అరెస్ట్‌లో వేధింపులే లక్ష్యం

మిథున్‌రెడ్డి అరెస్ట్‌లో వేధింపులే లక్ష్యం

మదనపల్లె: సాక్ష్యాలులేని అక్రమ కేసుల్లో తనను అరెస్ట్‌ చేసి కూటమి ప్రభుత్వం వేధించేందుకు సిద్ధమైందని మిథున్‌రెడ్డి ముందే పసిగట్టారు. తానొక ఎంపీని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తన ప్రమేయం, సంబంధం ఉండదు, అయినా తనను లక్ష్యంగా చేసుకుని వేధించేందుకు సిద్దమయ్యారని మిథున్‌రెడ్డి స్పష్టంగా చెప్పినా, ఆరోపణలపై సాక్ష్యాలు చూపాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టే జూలై 19న సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసినట్టు ప్రకటించారు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం ఆయన కుమారుడిపై కుట్రలు పన్నుతోంది.

● పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి చిన్న వయసులోనే రాజంపేట పార్లమెంట్‌ ఓటర్ల మనసును గెలుచుకుని వారికి దగ్గరయ్యారు. 2014లో తొలిసారి ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరీని ఓడించి మిథున్‌రెడ్డికి అధిక మెజార్టీ ఇచ్చారు.ఇదికాక పెద్దిరెడ్డి తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డిని ఓడించాలని గత ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ఓటర్లు ద్వారకనాధరెడ్డిని గెలిపించారు.

మానసికంగా వేధించాలనే...

కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని మానసికంగా వేధించే మార్గం ఎంచుకుంది. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని మద్యం అక్రమ కేసులో జూలై 19న చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్‌ చేయించింది. ఇప్పటిదాకా బెయిలు రాకుండా మానసిక వేధింపులకు గురిచేస్తోంది.

● గత తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కక్ష కట్టారు. 2014లో తొలిసారి రాజంపేట ఎంపీగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక.. అప్పుడే వేధింపులకు శ్రీకారం చుట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో ఓ ఉద్యోగిపై దాడి చేసినట్టు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలులేక న్యాయస్థానం కొట్టివేసిందని మిథున్‌ రెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే మిథున్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల, ప్రజాబలం చూసి ఓర్వలేక పోతున్నట్టు అర్థమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసు నిరాధారమని తేలిపోవడంతో ఇప్పుడు మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసి వేధిస్తున్నారు.

62 రోజుల తర్వాత కస్టడీకి

జూలై 19న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని మద్యం అక్రమ కేసులో అరెస్ట్‌ చేశారు. తర్వాత విచారణ కోసం సిట్‌ కస్టడీని కోరవచ్చు. అయితే అరెస్ట్‌ చేసిన రెండునెలలకు కస్టడీ కోరిన సిట్‌కు రెండురోజుల విచారణకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అరెస్ట్‌ అయిన 62 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిట్‌ కస్టడీ కోరినప్పటికే మిథున్‌రెడ్డి తరపున న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలైంది. బెయిల్‌ను కస్టడీ ద్వారా అడ్డుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన నెలకొంటోంది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డినిరాజకీయంగా ఎదుర్కోలేక కుమారుడిపై కుట్రలు, కుతంత్రాలు

బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణనుఅడ్డుకునేలా కస్టడీ

జూలై 19న అరెస్ట్‌..జైలు, కస్టడీ..రిమాండ్‌తో అటూఇటూ తిప్పుతున్నారు

‘నేను చెప్పేది ఒకటే..మేం ఇంట్లో పదిమంది ఉన్నాం. నన్ను అరెస్ట్‌ చేసినా పట్టించుకోను..దేనికై నా సిద్ధం. నన్ను చంపినా పర్వాలేదు. నా ఇంట్లో నా తమ్ముడో, మా అమ్మో వస్తుంది..కచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు అండగా నియోజకవర్గంలో నిలబడతాం.’ –అరెస్ట్‌కు కొన్నాళ్ల ముందు

ఎంపీ మిథున్‌రెడ్డి

‘గత టీడీపీ హయాంలో తప్పుడు కేసు పెట్టగా నిరూపణ కాకపోవడంతో కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అరెస్ట్‌కు భయపడే ప్రసక్తేలేదు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఓ బెటర్‌ పర్సన్‌గా బయటకొస్తాను. మీకు సహకరిస్తాను, సాక్ష్యాలు చూపండంటే చూపలేదు.నోటిమాటతో ముఖ్యనేతలను టార్గెట్‌ చేసి అక్రమకేసులతో వేధిస్తున్నారు.’

–జూలై 19న అరెస్ట్‌కు ముందు ఎంపీ మిథున్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement