
అవయవదానంతో ఏడుగురి జీవితాలకు వెలుగు
రాయచోటి : ఓ ప్రైవేట్ ఉద్యోగి అవయవదానం ఏడుగురి జీవితాలలో వెలుగులు నింపింది. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీటివాండ్లపల్లికు చెందిన వంశీధర్‌రెడ్డి (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన రాయచోటి నుంచి గాలివీడుకు వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు తేల్చారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్య బృందం వంశీధర్‌రెడ్డి తల్లి కళ్యాణికి అవయవదానంపై బుధవారం అవగాహన కల్పించారు. వైద్యుల సూచనలను ఆమె అంగీకరించారు. దీంతో వంశీధర్‌రెడ్డి నుంచి గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. అంతేకాకుండా కంటి కార్నియాలను కూడా సేకరించినట్లు వైద్యులు అంజనారైన పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆ యువకుడు మృతి చెందినా ఏడుగురిలో జీవం పోసుకోవడం విశేషం. అవయవదానం అనంతరం మృతదేహాన్ని గాలివీడు మండలంలోని ఆయన స్వగృహానికి తరలించారు.