
వేధింపులు భరించలేక భర్తను హతమార్చిన భార్య
ఆరునెలల తర్వాత విచారణలో వెలుగు చూసిన ఉదంతం
మదనపల్లె రూరల్ : మద్యం తాగి గొడవపడడమేగాక, తనను కొడుతూ కూలి డబ్బులు లాక్కుని వెళ్లే భర్త వేధింపులను భరించలేని భార్య, తన తమ్ముడి సాయంతో హత్య చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత పోలీసుల విచారణలో ఈ సంఘటన బయటపడింది. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రెడ్డెప్ప కుమారుడు రామన్న(40), భార్య రమణమ్మతో కలిసి ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చాడు. రామారావుకాలనీలోని ఓ అద్దె ఇంటిలో నివాసముంటూ కూలి పనులుచేసి జీవనం సాగిస్తున్నారు. కొద్ది కాలం తర్వాత మద్యానికి బానిసైన రామన్న ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగేందుకు అవసరమైస డబ్బులు భార్య నుంచి లాక్కునివెళ్లేవాడు. ఈ క్రమంలో మార్చి 12ణ మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రామన్న భార్యతో గొడపవడ్డాడు. అప్పటికే అతడి వేధింపులు భరించలేని ఆమె కర్రతో దాడిచేసింది. కిందపడిన అతడిపై రమణమ్మ తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో తలపై కొట్టాడు. దీంతో రెడ్డెప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య విషయం రాత్రివరకు గుట్టుచప్పుడు కాకుండా చూసిన రమణమ్మ, ఈశ్వర్ అనంతరం సంచిలో మృతదేహాన్ని మూటగట్టి బి.కొత్తకోట కస్తూర్బా స్కూల్ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన అన్న కనిపించకపోవడంపై వదిన రమణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెడ్డెప్ప సోదరుడు ఫిర్యాదుచేశాడు. సీఐ రాజారెడ్డి విచారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బి.కొత్తకోటలో పాతిపెట్టిన విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లి పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వేధింపులు భరించలేక భర్తను హతమార్చిన భార్య